తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చంద్రగిరి – భాకరపేట ఘాట్ రోడ్డుపై ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు రోడ్డుమీదకు రావడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. సుమారు గంటసేపు ఏనుగులు రోడ్డుపైనే నిల్చోవడంతో ప్రయాణికులు వాహనాలను నిలిపివేశారు. దీంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బాణాసంచా కాల్చి ఏనుగులను అడవిలోకి తరిమివేశారు. అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా పునరుద్ధరించబడ్డాయి.
రెండు నెలలుగా చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు మండలాల పరిధిలోని రంగంపేట, భీమవరం, కందులవారిపల్లి, శేషాపురం, ఎల్లంపల్లి, భాకరపేట, ఎగువవూరు, దిగువవూరు, చిట్టేచర్ల, దేవరకొండ తదితర గ్రామాల్లో ఏనుగుల సంచారం తీవ్రంగా పెరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఏనుగులు వరి, మామిడి, టమోటా, పశుగ్రాసం తదితర పంటలతో పాటు డ్రిప్ పైపులను ధ్వంసం చేసి రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని నెలలగా ఏనుగుల సంచారం పెరుగుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు, ఏనుగుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
